వ్యాపారులు, దళారులు కుమ్మక్కై.. బొప్పాయిలకు ధర లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ కడప జిల్లా రైల్వే కోడూరు రైతులు ఆందోళనకు దిగారు. లోడింగ్ కోసం వెళుతున్న లారీలను అడ్డుకున్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయామని.. పరిస్థితులు కుదుటపడి రేట్లు పెరుగుతాయని ఆశించామని.. దళారులు రేట్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు.
ఇతర రాష్ట్రాల్లో బొప్పాయి కేజీ రూ.20 నుంచి రూ. 40 వరకు పలుకుతుంటే.. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దళారులు కుమ్మక్కై రోజురోజుకూ రేట్లు తగ్గించి రైతులకు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం దళారులను కట్టడి చేయాలని.. బొప్పాయికి సరైన ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.