కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తుండగా.. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సౌకర్యాలు, అందరికీ అందుబాటు.. ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరేచోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. కొన్ని జిల్లాల పేర్లపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై విద్యార్థులు, సాధారణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. కడప జిల్లాలోని.. రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై స్థానికులు పార్టీలకు అతీతంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.
రైల్వేకోడూరులో భారీ ర్యాలీ...
రైల్వేకోడూరులో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేటను.. అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. రాజంపేటలో విద్యార్థి, యువజన సంఘాల ఐకాస రాస్తారోకో చేపట్టారు. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపై.. రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు ధర్నాలో పాల్గొనకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నప్పటికీ.. స్థానికులు, విద్యార్థులు రోడ్లపైనే బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.