కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య భౌతికకాయానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుడి భార్య అపరాజితతో మాట్లాడి హత్యకు దారి తీసిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, నిందితులకు కఠినశిక్ష వేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.
సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరులో నారా లోకేశ్ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో నందం సుబ్బయ్య కుటుంబసభ్యులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే, ఆయన బావమరిది, మున్సిపల్ కమిషనర్ పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే కడప జిల్లాలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగ నడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎఫ్‌ఐఆర్‌లో ముగ్గురి పేర్లు చేర్చేవరకూ ఆందోళన విరమించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు... నారా లోకేశ్ ధర్నా విరమిస్తే పరిశీలిస్తామని అన్నారు.