YS Avinash Reddy started to Hyderabad: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కావడానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెల్లవారుజామున పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి వాహనంలో బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా హైదరాబాద్ పయనమయ్యారు.
ఆయన వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసు ఇచ్చిన నేపధ్యంలో అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ విచారణకు హాజరైయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ కేసులో నిన్ననే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, తాజాగా అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడంపై ఉత్కంఠ కలిగిస్తుంది.
సహనిందితుడిగా వైఎస్ అవినాష్‌రెడ్డి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల జాబితాలో తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించినప్పుడు సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయమూర్తి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు.