రాయలసీమ జిల్లాలలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో కడప జిల్లా మారెళ్ళ మడకలో శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి కార్తిక దీపోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామి మూలవిరాట్‌కు దీప హారతి ఇచ్చారు.
కడప జిల్లాలో శోభాయమానంగా కార్తిక పూజలు - karthika pournami 2020
కార్తిక పౌర్ణమి సందర్భంగా కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చి కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.
శైవ క్షేత్రాల్లో పౌర్ణమి సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పట్టణ సమీపంలోని గవి మల్లేశ్వర స్వామి సన్నిధిలో లక్ష దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కడప నగరంలోని శివాలయాలు తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి... కార్తిక దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కడపలోని మృత్యుంజయ కుంట శివాలయం నవి కోట, దేవుని కడప, మోచం పేట శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.