ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం వేటలో.. వెంటాడిన మృత్యువు - కడప ఎర్రచందనం సమ్మగ్లర్ల ప్రమాదం అప్ డేట్స్

ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తమిళనాడు స్మగ్లర్లు మృత్యవాత పడటం తీవ్ర కలకలం రేగుతోంది. రెండుకార్లు, టిప్పర్ దగ్ధమైన ఘటనలో ఐదుగురు స్మగ్లర్లు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు స్మగ్లర్లను... కడపజిల్లాకు చెందిన లోకల్ హైజాక్ గ్యాంగ్ వెంటాడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రెండు కార్లలో ఒకటి తమిళనాడు స్మగ్లర్లది కాగా.. మరొకటి కడప జిల్లాకు చెందిన ముఠాదని పోలీసులు భావిస్తున్నారు.

kadapa red sandel smugglers road accident
కడపలో ఎర్రచందనం స్మగ్లర్ల సజీవ దహనం

By

Published : Nov 2, 2020, 1:39 PM IST

కడపజిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు మృత్యువాత పడ్డారు. గోటూరు వద్ద రెండు కార్లు.. ఎదురుగా వస్తున్న టిప్పర్​ను ఢీకొనడంతో మంటలు చెలరేగి మూడు వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న నలుగురు స్మగ్లర్లు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు గాయపడగా.... వారిని రిమ్స్​కు తరలించారు. వారిలో మూర్తి అనే స్మగ్లర్ చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

వెంబడించిన లోకల్ గ్యాంగ్

స్కార్పియో వాహనంలో ఎనిమిది మంది స్మగ్లర్లు.. ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు యత్నించారు. వీరంతా కడపజిల్లాలోని అడవుల్లో చెట్లను కొట్టి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించుకు వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని తీసుకెళ్తున్నారనే విషయాన్ని పసిగట్టిన జిల్లాకు చెందిన లోకల్ హైజాక్ గ్యాంగ్ వారి వాహనాన్ని వెంబడించింది. ఎక్కడైనా తమిళనాడు స్మగ్లర్లు ఎర్రచందనం తీసుకెళ్తుంటే.. వారి వెంటపడి వారి వద్దనున్న దుంగలను తస్కరించడం లోకల్ హైజాక్ గ్యాంగ్ పన్నాగం.

ఈ విధంగానే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో తమిళనాడుకు చెందిన స్కార్పియో వాహనంలో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలతో వెళ్తున్నట్లు లోకల్ హైజాక్ గ్యాంగ్​కు సమాచారం అందింది. వెంటనే లోకల్ గ్యాంగ్ ఎటియోస్ వాహనంలో వెంబడించారు. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు స్మగ్లర్లు వేగంగా వాహనాన్ని నడుపుతూ వెళ్లారు. గోటూరు వద్ద టిప్పర్... కంకర్ అన్ లోడు చేసి రోడ్డు మలుపు వద్ద తిరుగు తుండగా.. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొట్టాయి. టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించి మూడు వాహనాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో పాటు ఎనిమిది మంది స్మగ్లర్లలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఓ స్మగ్లర్ పరారయ్యారు. రిమ్స్​లో చికిత్స పొందుతూ మరో స్మగ్లర్ చనిపోయారు. ప్రస్తుతం ఇద్దరు స్మగ్లర్లు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ గ్యాంగ్ ముఠా సభ్యులు నలుగురు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఛాసీ నెంబర్లతో ఆరా

మూడు వాహనాలు దగ్ధమైన ప్రాంతాన్ని ఉదయం ఆర్టీవో అధికారులు పరిశీలించారు. కడప ఆర్టీవో శాంతకుమారి ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. రెవిన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు. రెండు కార్లకు ఉన్న నంబర్ ప్లేట్లు పూర్తిగా కాలిపోవడంతో.. వాటికి ఛాసీ నెంబర్లను ఆర్టీవో అధికారులు పరిశీలించారు. అవి ఏ ప్రాంతానికి చెందినవి.. ఎవరి పేరుతో ఉన్నాయనే వివరాలను ఆరా తీస్తున్నారు. పరారైన లోకల్ హైజాక్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్​ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. లోకల్ హైజాక్ గ్యాంగ్​కు చాపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ముఠా కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

రాజధాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details