కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. దిక్కుతోచని స్థితిలో చిన్నారుల చికిత్స కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, రమాదేవి దంపతులకు 14 ఏళ్ల తర్వాత సంతానంకలిగింది. నవమాసాలు నిండకుండానే మగ కవల పిల్లలు జన్మించారు. మూడు రోజుల కిందట జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించిన వీళ్లకు వెంటిలేటర్‌పై అత్యవసర వైద్య చికిత్స అందించాల్సి వచ్చింది. కానీ ఆ సౌకర్యం అక్కడ అందుబాటులో లేదు. నగరం అంతా వెదికినా ఒక్క ప్రైవేటు వైద్యశాల కనిపించలేదు. చిన్నారుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
చివరికి రిమ్స్ వైద్యశాలలో ఇంక్యూబేటర్పై వైద్యులు చికిత్స అందిస్తున్నా... శిశువుల పరిస్థితి ఏమౌతుందోననే ఆందోళనతో ప్రైవేటు వైద్యశాల కోసం వెదికారు. ఆఖరికి నగరంలోని వన్ టౌన్ పి.ఎస్ పరిధిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్సకు సంబంధించి అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. బాధితులు వెంటనే హాస్పిటల్ వద్దకు బయలు దేరారు. మార్గమధ్యంలో కడప నగర వన్ టౌన్ సీఐ టీవీ సత్యనారాయణకు తమ ఆవేదన వివరించారు. వెంటనే తన వాహనంలో వారిని ప్రైవేట్ వైద్యశాలకు సీఐ తీసుకువెళ్లారు. సదరు వైద్యశాల వైద్యులు పసికందుల వైద్యానికి నిరాకరించారు. బాధితులు వెంటనే జిల్లా ఎస్పీ అన్బురాజన్ దృష్టికి తీసుకెళ్లారు.