ఈ చెరసాల...ప్రకృతి మురిసేలా! కారాగారలందూ ఈ కరాగారం వేరయా...చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే. ఒకటి రెండు కాదు.. అక్కడికి వెళితే...కొన్ని వేల మెుక్కలు, చెట్లు చల్లటి గాలితో ఆహ్వానం పలుకుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే...జైలు కాదది..నందనవనం. మరోవైపు ఆవరణమంతా ముగ్గులతో పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. ఈ జైలు ఎక్కడో కాదు కడప జిల్లాలోనే.. ఉంది.
ఆలోచన..ఆచరణలో..
కడప శివారులో ప్రత్యేక మహిళా కారాగారం ఏర్పాటు చేశారు. సుమారు వందమంది మహిళా ఖైదీలు ఉన్నారు. వారంతా...వివిధ రకాల నేరాలు చేసి వచ్చిన వారే. ఖాళీగా కూర్చో పెడితే లేనిపోని ఆలోచనలు వస్తాయనుకున్నారు అధికారులు. ఏదైనా పని చెయించాలనుకున్నారు. ఎక్కడ చూసినా.. వాతావరణం కలుషితం అవుతుందన్న ఆలోచన తట్టింది వారికి. వాతావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జైలు అధికారి వసంత మొక్కలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని వేల మొక్కలు పెంచే పని పెట్టుకున్నారు. మరోవైపు సుమారు 100 వరకు చెట్లూ పెంచారు.
ఆరోగ్యంగా బయటకు!
పచ్చదనమే కాదు జైలు ఆవరణమంతా ముగ్గులతో హరివిల్లులా కనిపిస్తుంది. పూల మొక్కల సంరక్షణ మహిళా ఖైదీలకు అప్పగించారు. రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పోయడం...వాటి సంరక్షణ చూసుకుంటారు. పూల మెుక్కలు, పండ్ల చెట్లతోపాటు కూరగాయల చెట్లు అనేకమున్నాయి. మొక్కలను ఖైదీలు తమ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. జైలుకు వచ్చే ముందు అనారోగ్యంతో ఉన్న ఖైదీలు విడుదలై వెళ్లేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్తున్నారు. కారణం అక్కడ ఉన్న పచ్చదనమే. కారాగారం అంటే కఠిన శిక్షలు కావని...పచ్చదనానికి పరిశుభ్రతకు మారుపేరని...నిరుపిస్తోందీ కడపలోని మాహిళా కారాగారం.