బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్తలుగా పనిచేయడానికి ఏటా మే మాసంలో ఇస్రో యంగ్ సైంటిస్ట్ పేరుతో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తొమ్మిదో తరగతి నుంచి వరసగా ఏడేళ్ల పాటు ఏడు దశల్లో ఇస్రో పరీక్షలు నిర్వహిస్తుంది. ఆయా తరగతుల్లోని సైన్సు సబ్జెక్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకూ పరీక్షలు నిర్వహించిన తర్వాత అన్నిట్లో ఉత్తీర్ణులైన వారు... కేరళలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ప్రవేశానికి అర్హత సాధిస్తారు. ఇలా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామానికి చెందిన అవ్వారు చందన... తొమ్మిదో తరగతిలో తొలిసారిగా ఇస్రో పరీక్ష రాసి... ఉత్తీర్ణత సాధించింది. అనంతరం టెన్త్, ఇంటర్, డిగ్రీ... ఇలా వరుసగా ఏడేళ్లు ఇస్రో పరీక్షల్లో సత్తా చాటింది. 2019 ఏప్రిల్ 10న దాదాపు 3 లక్షల మంది ఫైనల్ పరీక్షలు రాయగా... అవ్వారు చందన జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. అయితే తొలుత తండ్రి కోరిక మేరకు డీఎడ్ పూర్తి చేసిన చందన... అనంతరం ఓపెన్ డిగ్రీ చేసి ఇస్రో పరీక్షలకూ సన్నద్ధమైంది.
ఓపెన్ డిగ్రీ చేసింది.. ఇస్రో తలుపు తట్టింది! - iist
ఇస్రోలో శాస్త్రవేత్తగా అడుగు పెట్టాలనేది చాలామంది కల. ఏడేళ్లపాటు 7దశల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారే ఇస్రో ప్రవేశానికి అర్హులు. ఎంతో కష్టమైన ఈ ప్రక్రియలో కడప జిల్లాకు చెందిన యువతి సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఫైనల్ పరీక్షలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించి ఔరా అనిపించింది. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడదామనుకుని చివరికి ఇస్రోకు ఎంపికైంది.
ఫైనల్ పరీక్షలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల స్టయిఫండ్‌ను అందజేస్తుంది. ఈ మేరకు చందనకు 50 లక్షల రూపాయలు కూడా విడుదలైనట్లు ఇటీవల కడప కలెక్టరేట్‌కు వచ్చిన ఇస్రో అధికారులు తెలియజేశారు. ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఈనెల 30న బెంగళూరులోని ఇస్రో స్పేస్ సెంటర్కు రావాలని చందనకు ఆహ్వానం అందింది.
ఇస్రో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది.. ఎలా పరీక్షలు రాయాలనేది చాలామందికి అవగాహన ఉండదు. ఇప్పుడు చందన ఇస్రోకు ఎంపికైనందున.. ఈనెలాఖరు లోపు ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఇస్రో పరీక్షలపై అవగాహన కల్పించాలని ఇస్రో డైరెక్టర్ల నుంచి చందనకు వర్తమానం రావడం విశేషం.