లాక్డౌన్ సడలింపులతో విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడం వల్ల కడప విమానాశ్రయం మళ్లీ సందడిగా మారింది. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌కు పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు 23 మందిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా తీవ్రత తక్కువున్న హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చే వారికి మినహాయింపులు ఇచ్చారు.
లాక్డౌన్ కారణంగా మూతపడ్డ కడప విమానాశ్రయం... సడలింపులతో ఈ నెల 27 నుంచి తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించింది. కడప విమానాశ్రయం నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. నైట్ ల్యాండింగ్ లేకపోవడం వల్ల సాయంత్రం వరకు మాత్రమే ఇక్కడ సర్వీసులు కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న తమిళనాడు నుంచి కడపకు వచ్చే ప్రయాణికులకు అధికారులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 27వ తేదీన చెన్నై నుంచి తొలి ట్రూజెట్ విమాన సర్వీసు కడపకు చేరుకుంది. ఇందులో 23 మంది ప్రయాణికులకు అధికారులు.. విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాల్లో ఉన్న చెన్నై, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా వారిని 14 రోజులు క్వారంటైన్ చేస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా విమానాశ్రయంలో ఏర్పాట్లు చేశామని కడప విమానాశ్రయం డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు.