Tulsi Reddy's sensational comments : రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఏపీసీసీ మీడియా అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్అండ్ బీ అతిథి గృహంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఐ ప్యాక్ సర్వే ప్రకారం 25 మంది మంత్రుల్లో 20 మంది, 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందన్నారు.
అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత :ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఆ సంస్థ జనవరిలో నిర్వహించిన సర్వేలో జగన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత స్పష్టమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పులివెందులలో జగన్ అడ్రస్ కూడా ఉండదన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఎంతో.. అంతే తేడాతో ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ఎవరి నోట విన్నా ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పారు. "రైతులు రగిలి పోతున్నారు.. మహిళలు మండిపోతున్నారు.. ఉద్యోగులు ఉడికిపోతున్నారు.. యువత ఊగిపోతున్నారు.. ఎవరిని కదిలించినా ఛీఛీ అనే పరిస్థితి వచ్చింది" అని తెలిపారు.