Idupulapaya IIIT students withdrew protests: కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలమయ్యాయి. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇవ్వటంతో.. మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనలను విద్యార్థులు విరమించారు. ఆర్జీయూకేటీ (RJUKT) ఛాన్సలర్ కె.సి.రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో, పాడా ఓఎస్డీ.. ఉదయం నుంచి విద్యార్థులతో చర్చలు జరిపారు.
ట్రిపుల్ ఐటీలో.. ఉన్న 6వేల మంది విద్యార్థులకు తోడు.. ఒంగోలు నుంచి మరో 3 వేల మంది విద్యార్థులు వచ్చారు. ఒంగోలు నుంచి వచ్చిన వారికి కొత్త క్యాంపస్‌లు కేటాయించి... అక్కడ ఉన్న P-1, P-2 విద్యార్థులను పాత క్యాంపస్‌కు వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో సమస్య మొదలైంది. పాత క్యాంపస్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేవని.. విషపురుగులు సంచరిస్తున్నాయని P-1, P-2 విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
అసలు వివాదం ఏంటంటే?
కనీస వసతులు కూడా కల్పించకుండా.. తమను కొత్త క్యాంపస్ నుంచి పాత క్యాంపస్ కు వెళ్లమని చెబుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సరైన వసతులు కల్పించే వరకూ పాత క్యాంపస్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. ఉన్నఫళంగా పాత క్యాంపస్‌లోకి వెళ్లాలంటూ శనివారం రాత్రి 9 గంటలకు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణి చెప్పారని.. అప్పటినుంచి వివాదం చెలరేగిందని విద్యార్థులు తెలిపారు.
3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని.. దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఇడుపులపాయ వచ్చిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణిని నిలదీయడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.
సంబంధిత కథనాలు:"ఇడుపులపాయ"లో సద్దుమణగని ఆందోళన.. తగ్గేదే లే అంటున్న విద్యార్థులు