కడప జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకు సరిహద్దుగా ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పులివెందుల - కదిరి ప్రధాన మార్గంలోని ఘాట్ రోడ్డు వద్ద వంతెన దెబ్బతినడంతో ఆర్టీసీ సేవలను అధికారులు నిలిపివేశారు. వెలిగల్లు ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో.. 3 వేల క్యూసెక్కుల నీటిని పాపాగ్ని నదికి విడుదల చేశారు.
చిత్తూరు జిల్లా నుంచి వస్తున్న వరద..
చిత్తూరు జిల్లా నుంచి వస్తున్న వరద నీటిని సుండుపల్లి మండలంలోని పించా ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లాలోని పాపాగ్ని, మాండవ్య, బాహుదా, పించా, పెన్నా నదులు ప్రవహించడంతో.. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వెళుతోంది. పాపాగ్ని నది పరివాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి. చక్రాయపేట మండలంలోని కాలేటి ప్రాజెక్టు సైతం వరదకు నిండుకుండలా మారడంతో.. పాపాగ్ని నది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా కరుస్తున్న వర్షాల నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ విజయరామరాజు అన్ని మండలాల రెవెన్యూ, నీటిపారుదల, రహదారుల శాఖ అధికారులను, గ్రామ సచివాలయంలో సిబ్బందిని అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:
murder: పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరికి వచ్చాడు.. మూడు రోజుల తర్వాత..