నెల్లూరు సోమశిల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరుతుండటంతో జలాశయం నుంచి నీటిని పెన్నా పరివాహక ప్రాంతం గుండా కిందకు వదలుతున్నారు. ఈ కారణంగా సంగం మండలంలోని లోతట్టు ప్రాంతంలో ఉండె వీర్లగుడిపాడు గ్రామం చుట్టూ నీరు చేరడం వల్ల జనాలు నానా అవస్థలు పడుతున్నారు. 120 కుటుంబాల చుట్డూ నీరు చేరడం వల్ల ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు వారిని బయటకు తరలించే పనిలో పడ్డారు. పెన్నా పరివాహక ప్రాంతంలో ఉండే అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో కోత దశలో వున్న వరి పంట నీట మునిగింది.
అతి పెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా కంభం చెరువుకు జలకళ సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు చెరువు క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతానికి 9 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, మధ్యలో నిండుకుండలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది.
చినుకు పడితే నడిచేందుకు రహదారిపై సాహసం చేయాల్సిన పరిస్థితి విశాఖ జిల్లా పాయకరావుపేటలో నెలకొంది. పాయకరావుపేట పట్టణ ప్రధాన రహదారి కొంతకాలంగా అభివృద్ధి చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి. వై కూడలి నుంచి గౌతమ్ థియేటర్ వరకు రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వీటిలోకి నీరు చేరడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కడప జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. విస్తారంగా కురిసిన వర్షాలకు... ప్రధాన రహదారులు జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు. గండికోట జలాశయానికి భారీగా నీరు చేరగా.... ముంపువాసులను ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. కమలాపురం మండలం గొల్లపల్లి వద్ద వరదనీటి ఉద్ధృతికి వంతెన మధ్య పెద్ద గుంత పడటంతో.... బ్రిడ్జి మరింత బలహీనపడింది.
గండికోట జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో.... ముంపు గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గండికోట నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని మైలవరం ప్రాజెక్టులోకి వదలగా.... మైలవరం జలాశయంలో 9 గేట్లు ఎత్తి... 35 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడిచారు. గండికోట జలాశయం పరిధిలోని తాళ్ల పొద్దుటూరు బీసీ కాలనీలోకి నీళ్లు చేరి స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టు నిండడం వల్ల అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదిలారు. దీంతో కడప నగరం నడిబొడ్డున ఉన్న బుగ్గవంకలోకి భారీగా వరద ప్రవహిస్తోంది.