వ్యాపారుల పలాయనం... రుణదాతల అయోమయం - gold
ప్రొద్దుటూరు నగరం బంగారు వ్యాపారుల మోసాలకు నిలయంగా మారింది. అవగాహన లేమి, అత్యాశ, అనుభవ రాహిత్యంతో బంగారు వ్యాపారంలోకి దిగే వారు.. చివరికి ఐపీలు పెట్టి పారిపోతున్నారు.
పసిడి వర్తకానికి పెట్టింది పేరైన కడప జిల్లా ప్రొద్దుటూరులో... ప్రస్తుతం ఓ వైపు ఐపీలు.. మరోవైపు మోసాలు నిత్యకృత్యంగా సాగుతున్నాయి. రెండేళ్లలో సుమారు 100 కోట్ల రూపాయల మేర ఐపీలు పెట్టి పలువురు పట్టణాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్రొద్దుటూరులో మునిస్వామి జువెలర్స్ యజమాని 15 కోట్ల రూపాయలు ఐపీ పెట్టాడు. ఎన్ఎస్కాంప్లెక్స్ బంగారం వ్యాపారి సుమారు 17 కోట్ల రూపాయలు ఐపీ పెట్టి తిరిగి రాలేదు. మోక్షగుండం వీధికి చెందిన మరో వర్తకుడు 8 కోట్ల రూపాయలు అప్పు చేసి రిక్తహస్తం చూపించాడు. రైల్వే పోలీసునంటూ ఒకటిన్నర కిలోల బంగారంతో ఉడాయించాడో మోసగాడు. ఇవన్నీ అప్రకటిత ఐపీలే. అప్పులు తలకు మించిన భారం కావటంతో పలాయనం చిత్తగించినవారే. చివరికి రుణదాతలు ఏం చెయ్యాలో పాలుపోక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. పోలీసులే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.