కడప జిల్లాలోని రైతులు.. తామే కాడె మోసి... పొలం దున్ని కాలం సాగిస్తున్నారు. కాడెద్దులు కరువైన నిస్సహాయ స్థితిలో... యంత్రాలపై ఆధారపడుతున్నారు. పంటలోని కలుపు నివారణ కోసం... కూలీలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. కరువు పీడిత ప్రాంతమైన కడప జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి, గాలివీడు, రామాపురం మండలాల్లో టమోటా సాగు విస్తారంగా ఉంటుంది. పొలంలో కలుపు నివారణ రైతులకు భారంగా మారుతోంది. కూలీల ఖర్చునైనా తగ్గించుకుందామని అనుకుంటున్న రైతులే కాడె మోస్తున్నారు.
కడప జిల్లాలోని సంబేపల్లి మండలానికి చెందిన నాగరాజు అనే రైతు ఎకరన్నర పొలంలో టమోటా పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట కలుపు దశకు చేరుకుంది. పొలానికి వెళ్లి గుంటికను సార్ల వెంట లాగుతూ కలుపు నివారిస్తున్నాడు ఆ రైతు. ఎకరా పంటలో కలుపు నివారణకు రూ.7 వేలు ఖర్చు పెట్టలేక రూ.1000 తో గుంటికను కొనుగోలు చేసి... చేతి కష్టంతో కూలీల భారం తప్పించుకుంటున్నామని వివరించారు.