"కామేశ్వరా.. కళ్లు తెరువు నాయనా.. మాకు దిక్కు లేకుండా చేశావా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయా.. నాకే కష్టం వచ్చినా నీతో చెప్పుకొనేదాన్ని కదరా.. ఇకనుంచి ఎవరితో చెప్పుకోనురా.. కాలేజీకి పోకుండా ఒక్కడివే గదిలో ఎందుకున్నావురా.. లేరా కామేశ్వరా".. అంటూ తన కుమారుడి మృతదేహంపై పడి ఆ తల్లి రోదించడం చూసి తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
కడప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్న.. బండి లక్ష్మీకామేశ్వరరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీకామేశ్వర్‌రెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు కలిసి గదిలో ఉంటున్నారు. రోజులాగే సోమవారం కూడా తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లారు. కామేశ్వర్‌రెడ్డి మాత్రం కళాశాలకు వెళ్లకుండా గదిలోనే ఉండిపోయాడు. తోటి విద్యార్థులు తిరిగొచ్చి చూసేసరికి అతను గదిలో తాడుకు వేలాడుతూ కనిపించడంతో.. నిర్ఘాంతపోయి పోలీసులకు సమాచారం అందించారు. మన్నూరు ఎస్సై షేక్ రోషన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.