గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలను తరిమికొట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో చెత్త సేకరణకు ఆటో రిక్షాల స్థానంలో ఈ పవర్ ఆటోలను రంగంలోకి దించుతోంది. తాజాగా కడప జిల్లాలో 2 వేల జనాభా పైబడి ఉన్న 440 పంచాయతీలకు ఈ-పవర్ ఆటోలను మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఈ-పవర్ ఆటోలను ఆయా మండల పరిధిలోని ఎంపీడీవోలు, ఈవోఆర్డీల సమక్షంలో పంచాయతీలకు వీటిని అందజేయనున్నారు.
పారిశుద్ధ్య సమస్యలకు 'ఈ- పవర్‌తో' చెక్
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకే పరిమితం అయిన ఈ-పవర్ ఆటోలు... ఇక నుంచి గ్రామ పంచాయతీలకూ విస్తరించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయా పంచాయతీలకు ఈ-పవర్ ఆటోలు పంపిణీ చేశారు. తాజాగా కడప జిల్లాలోని 440 పంచాయతీలకు ఈ-పవర్ ఆటోలను పంపిణీ చేస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం వీటిని వినియోగించనున్నారు.
ఈ పవర్ ఆటోలు
సబ్సిడీతో అందజేత
ఇప్పటికే 440 పంచాయతీల్లో ఈ-పవర్ ఆటోలను తీసుకునే ఎస్సీ లబ్ధిదారులైన పారిశుద్ధ్య కార్మికులను వీటి కోసం ఎంపిక చేశారు. 2 లక్షల రూపాయల విలువ చేసే ఈ-పవర్ ఆటోను లబ్ధిదారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మినహా లక్ష రూపాయలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం అందించే ఈ-పవర్ ఆటోల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీరనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.