YS KONDAREDDY CASE DISMISSED : సీఎం జగన్ సమీప బంధువు, వైఎస్సార్ జిల్లా చక్రాయపేట వైఎస్సార్సీపీ నేత వైఎస్ కొండారెడ్డిపై నమోదైన కేసును లక్కిరెడ్డి పల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శారదా శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ కేసుకి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. చక్రాయపేట మండలంలో ఎస్ఆర్కే కన్‌స్ట్రక్షన్ గుత్తేదారును కొండారెడ్డి బెదిరించారని ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అతనిపై చక్రాయపేట పోలీసులు 2022 మే 9న కేసు నమోదు చేశారు. అతన్ని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేసి రాయచోటి జైలుకు తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుత ఈ కేసు విచారణ పూర్తి చేసుకోగా సరైన సాక్షాధారాలు లేని కారణంగా కేసు కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే: చక్రాయపేట మండలంలో SRK కన్‌స్ట్రక్షన్ సంస్థ.. రాయచోటి-పులివెందుల రహదారి పనులు చేస్తోంది. చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా ఉన్న వైఎస్ కొండా రెడ్డి.. ఎస్ఆర్కే సంస్థ గుత్తేదారును డబ్బులు కావాలని డిమాండు చేసి బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ జరిపారు. చక్రాయపేట మండలంలో పనులు చేయాలంటే తప్పకుండా తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని గుత్తేదారును బెదిరించినట్లు విచారణలో తేలడంతో గత సంవత్సరం మే లో ఆయనను అరెస్ట్ చేశారు.