DGP Rajendranath Reddy Cases: రాష్ట్ర పోలీస్ అధికారి రాజేంద్రనాథ్ రెడ్డి రాత్రి పది గంటలకు కడప పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. కర్నూల్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రోడ్డు మార్గాన కడపకు చేరుకున్నారు. కడప పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి కడప జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా కడప జిల్లాకు వచ్చారు.పోలీస్ కార్యాలయం వద్ద కర్నూలు రేంజ్డీఐజీ సెంథిల్ కుమార్, కడప, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు అంబు రాజన్, గంగాధర్ రావులు డీజీపీకి పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లాల డీఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానించారు. అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి కడప జిల్లాలో నేరాల సంఖ్యను పూర్తిస్థాయిలో తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. ఎర్ర చందనం, గంజాయి అక్రమ రవాణా, ఇసుక తదితర వాటిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. మహిళల నేరాలపై త్వరితగతిన స్పందించి వారికి న్యాయం చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని తెలిపారు. సమావేశం అనంతరం ఇక్కడే రాత్రి బస చేశారు.
DGP Rajendranath Reddy: 'ఆరు నెలల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.. హ్యూమన్ ట్రాఫికింగ్ లేదు' - ఏపీ పోలీసులు
DGP Rajendranath Reddy on Crimes : రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రోడ్డు మార్గాన కడపకు చేరుకున్నారు.
రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు తీసుకుంటున్న చర్యల కారణంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు,ఎస్సీ ఎస్టీ కేసులు బాగా తగ్గినట్లు చెప్పారు.దిశ యాప్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ సంఖ్యలో నేరస్థులకు శిక్షలు పడేలా చేశామన్నారు. రౌడీ గ్యాంగ్ లపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నామని, ముచ్చుమర్రిలో వైసీపీ నేత మధు ఇంట్లో బాంబుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మహిళల మిస్సింగ్ కేసులపై సరైన ఆధారాలతో మాట్లాడాలని వివరించారు.
ఆరు నెలల వ్యవధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ వెల్లడించారు. అసత్య ఆరోపణలు చేయొద్దని పేర్కొన్నారు. 7600 ఎకరాల్లో గంజాయిని గుర్తించి ధ్వంసం చేశామన్న డీజీపీ..ఆంధ్రప్రదేశ్లో 7600 ఎకరాల్లోనే పంటలు పండిస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి సాగు లేదని, ఒడిశా నుంచి సరఫరా అవుతోందని చెప్పారు. మూడేళ్లలో 26వేల మంది మిస్సింగ్ కేసులు నమోదైతే.. అందులో 23వేల కేసులు ట్రేస్ చేశాం. వారంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంవత్సర కాలంలో 2713మందిని ట్రేస్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా దర్యాప్తులో ఉన్నాయి. అలాగని హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందని చెప్పడం సరికాదు.