వాళ్లను భాజపాలోకి పంపిది ఆయనే: అంజాద్ బాషా - Amjab Basha
తెదేపా ఎంపీలను భాజపాలోకి చంద్రబాబునాయుడే పంపించారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. త్వరలోనే తెదేపా దుకాణం మూతపడటం ఖాయమని అన్నారు.
కడపలోని తన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రజాదర్బార్ నిర్వహించారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు.. వారి సమస్యలను వినతి పత్రాల రూపంలో మంత్రికి అందజేశారు. ఇంటి స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు తదితర సమస్యలను విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి... నలుగురు తెదేపా ఎంపీలను చంద్రబాబే దగ్గరుండీ భాజపాలోకి సాగనంపారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అవినీతిపై విచారణ చేపట్టడం ఖాయమని.. ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తోందోనని ముందుగానే తన ఎంపీలను భాజపాలోకి పంపించారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.