మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (Viveka Murder Case) నిందితుడుగా (ఏ-4) ఉన్న ఆయన మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్‌పై (CBI Approver Petition) న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. గత నెల 22న సీఆర్పీసీ సెక్షన్ 306 ప్రకారం వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని..అతని వాంగ్మూలం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో (Kadapa Sub Court) సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మరో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలకు సీబీఐ నోటీసులు కూడా పంపింది.
ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు ఇటీవల సీబీఐ (CBI) వేసిన అప్రూవర్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పత్రాలు ఇవ్వాలని న్యాయవాదుల కోరడంతో.. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈనెల 13న ఆ పత్రాలను ముగ్గురు న్యాయవాదులకు అందజేసింది. దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హత్యకు ప్రణాళిక రచించింది ఎర్ర గంగిరెడ్డేనని దస్తగిరి వాంగ్మూలంలో తేల్చి చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు బుధవారం కడప సబ్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నారు.
ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్
మరోవైపు వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై న్యాయస్థానం విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్య కేసులో అరెస్టై..ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.