Tulasi Reddy Comments : కాంగ్రెస్ పార్టీకి కేంద్రం, రాష్ట్రంలో పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మెన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 లోక్సభ స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. ఇండియా టుడే - సీఓటర్ తాజా సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌కు 191 స్థానాలు వస్తాయని తేలింది. దీనిబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని విమర్శించారు.
జనవరిలో ఐ ప్యాక్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర కేబినెట్లో ఉన్న 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని, 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారని తేలిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, కాబట్టి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తథ్యమని తులసిరెడ్డి అన్నారు.