CBN On Viveka Murder Case:‘ఆయన అనంతపురం జిల్లా జైలర్‌గా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడు మొద్దు శీను చనిపోయాడు. ఆ కేసులో ఒక్కొక్కరూ హతమయ్యారు. తర్వాత ఆయన చాలాకాలం సస్పెన్షన్‌లో ఉన్నారు. సస్పెన్షన్లు తొలగించి ఇప్పుడు కడప జైలుకు ఇన్‌ఛార్జిగా పంపించారు. అక్కడే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులున్నారు. వారిని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. కడప జైలర్ వరుణారెడ్డిపై ఆయన సందేహం ప్రకటించారు. కడప జైల్లో జరుగుతున్న పరిణామాలపై సీబీఐకి లేఖ రాస్తామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆడుతున్న జగన్నాటకమని ఆరోపించారు. సీఐడీ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని.. రేపనేది ఒకటి ఉంటుందని పోలీసులు, సీఐడీ అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కానిస్టేబుల్ నుంచి డీఐజీ వరకు అందరినీ గుర్తుపెట్టుకుంటామని, చట్టవ్యతిరేకంగా వ్యవహరించినవారు తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని మండిపడ్డారు. సీఐడీ పోలీసులు అరెస్టు చేసి, బెయిలుపై విడుదలైన పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును శనివారం విజయవాడలోని ఆయన నివాసానికి వచ్చి చంద్రబాబు పరామర్శించారు. అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఆయన కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఆయనేమన్నా ఉగ్రవాదా?
‘అశోక్‌బాబును ఒక టెర్రరిస్టు, కరడుగట్టిన నేరస్థుడిలా అర్ధరాత్రి కిడ్నాప్ తరహాలో అరెస్టు చేయడం ఏమిటి? ఆయన చేసిన తప్పేంటి? మీరు ప్రశ్నించాలనుకుంటే నేరుగా తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వస్తే.. అక్కడే అశోక్‌బాబు ఉంటారు. అరెస్టు చేసి 18 గంటలు ఎక్కడెక్కడో తిప్పి, నోటీసు కూడా ఇవ్వలేని తప్పుడు నేరాలు మోపి కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసేంటి? ఉద్యోగుల ఉద్యమం గురించి ప్రశ్నలు వేస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారం? ముఖ్యమంత్రి చెబితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తారా? దీనికి బాధ్యులైన అందరిపై ప్రైవేటు కేసులు దాఖలు చేసి, న్యాయం ముందు నిలబెడతాం’ అని చంద్రబాబు సీఐడీ అధికారులపై ధ్వజమెత్తారు. ‘క్విడ్‌ప్రో కో తరహాలో ఓ అధికారి తమ్ముడి భార్యకు డైరెక్టర్ పదవి ఇప్పించి అశోక్‌బాబుపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. దీనిపై గతంలో శాఖాపరమైన విచారణలో అశోక్ తప్పులేదని తేల్చారు. ఆయన పదవీవిరమణ చేసిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసును తవ్వితీయడం కక్ష సాధింపు కాదా? ఎంపీ రఘురామ కృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? సీఐడీకి ఎంత ధైర్యం?’ అని మండిపడ్డారు. ‘అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ తెలుగుదేశం ఉంటుంది. ఉద్యోగులకు మద్దతిస్తాం. వారి కోసం పోరాడతాం’ అని స్పష్టం చేశారు.