కడప జిల్లా పొద్దుటూరులో తెదేపా నాయకుడు నందం సుబ్బయ్య హత్యను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుబెట్టడమే వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్లో వైకాపా ఎమ్మెల్యే, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చారని ఆరోపించారు.
'ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన తెదేపా నాయకుడిని హత్య చేయించడం సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు' అన్నారు. ఇళ్ల పట్టాల్లో అవినీతిని బైటపెట్టి.. నిరసనలు తెలిపాడనే సుబ్బయ్యను హతమార్చారని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతిరోజూ, ప్రతి పూటా హత్యలు, మానభంగాలు, హింస, విధ్వంసాలు నిత్యకృత్యం అయ్యాయని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేల అవినీతి కుంభకోణాలను బైటపెట్టిన వాళ్ల ప్రాణాలు తీయడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ ఆఫ్ లా రాష్ట్రంలో ఏ స్థాయికి దిగజారిందో, ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం పాలవుతుందో సుబ్బయ్య హత్యోదంతమే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు.