Police Filed Cases on TDP Leader B Tech Ravi: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బీటెక్ రవి సహా మొత్తం 30మందిపై చక్రాయపేట పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద.. కేసులు పెట్టారు. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి స్థలంలో.. వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తున్నారని తెలిసి.. ఆదివారం బీటెక్ రవి తన అనుచరులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఆ స్థలం తమకు చెందినదేనని.. బీటెక్ రవి తన అనుచరులతో కలిసి దౌర్జన్యంగా స్థలంలో అక్రమంగా దున్నేశారని.. వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బీటెక్ రవితో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు.
సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్ధాయికి చేరాయి: బీటెక్ రవి, తెలుగుదేశం నేతలపై కేసులను పెట్టడంపై.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మండిపడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని కబ్జా చేసి వెంచర్ వేసే హక్కు.. వైసీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బీటెక్ రవితో పాటు తెలుగుదేశం నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని.. అచ్చెన్న డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్ధాయికి చేరాయని ధ్వజమెత్తారు. భూములు కబ్జా చేయడమే కాక బాధితులకు అండగా నిలబడిన వారిపై అక్రమ కేసులా అని నిలదీశారు.