Viveka Murder Case: వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయోననే ఉత్కంఠ కడప జిల్లాలో నెలకొంది. వివేకా కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ప్రమేయాలపై ఇప్పటికే పలువురు సాక్షులు సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం... ఛార్జిషీట‌్‌లో వారి ప్రమేయంపై పొందుపరచడం జరిగింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్న కీలక సాక్షులుగా ఉన్నారు. వారే కేసుకు ప్రత్యక్ష సాక్షులు. అయితే వారిద్దరూ పులివెందులలోనే నివాసం ఉంటున్నారు. ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతంలో వారు నివసిస్తున్న దృష్ట్యా... వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇపుడు సీబీఐ అధికారులపై ఉంది. వివేకాను 2019 మార్చి 15న ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కలిసి హత్య చేసినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురిలో దస్తగిరి పూర్తిగా అప్రూవర్‌గా మారిపోవడం... అతనికి కడప కోర్టు క్షమాభిక్ష ప్రసాదించిన నేపథ్యంలో అందరి దృష్టి అతనిపై కేంద్రీకృతమైంది. వైకాపాకు చెందిన ప్రముఖ నాయకులు పులివెందులలోనే ఉండటంతో... తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారం కిందటే భద్రత కల్పించాలని పోలీసులను, సీబీఐ దస్తగిరి అధికారులను కోరాడు. వాచ్ మెన్ రంగన్న కూడా వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటి బయట నిద్ర పోయాడు. ఇంట్లో తెల్లవారుజామున కేకలు విని నిద్రలేచి చూస్తే.. నలుగురు నిందితులు వివేకాను హత్యచేసి పారిపోయినట్లు గమనించారు. దీంతో రంగన్న కూడా సీబీఐకి కీలక సాక్షిగా మారాడు. ఇలాంటి పరిస్థితుల్లో దస్తగిరి, రంగన్న ఇంటి వద్ద కేవలం ఒకరి చొప్పున మాత్రమే కానిస్టేబుల్ భద్రత కల్పిస్తున్నారు.
నేడు కడప కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసే అవకాశం...
ఇపుడు కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో... ఛార్జిషీట్‌లో పేర్కొన్న వారిలో ప్రముఖులను అరెస్ట్ చేయాడనికి సీబీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ముందుగా ఇద్దరు సాక్ష్యులకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకోవాలని సీబీఐ భావిస్తోంది. అందులో భాగంగా నిన్న సీబీఐ అధికారులు పులివెందులకు వెళ్లి వాచ్ మెన్ రంగన్న, డ్రైవర్ దస్తగిరిని తమ వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరిచేత కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. అయితే ఇద్దరికి భద్రత కల్పించే అంశంపై నేడు కడప కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్టు ద్వారానే ఇద్దరికీ సెక్యూరిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరికీ భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత.. తదుపరి చర్యలకు సీబీఐ ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అరుపులు వినిపించాయి..