వివేకా హత్యకేసులో 92వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన కృష్ణమాచార్యులను సీబీఐ అధికారులు.. ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట కృష్ణమాచార్యులను హాజరుపరిచారు. ఈ క్రమంలో 164 సెక్షన్ కింద కృష్ణమాచార్యుల వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు మేజిస్ట్రేట్ తెలిపారు. కృష్ణమాచార్యులు.. కదిరిలో హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇతనిని సీబీఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది.
ఇదివరకే వాచ్మెన్ రంగన్న, మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి దగ్గర నుంచి కూడా సీబీఐ అధికారులు 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు. తాజాగా దస్తగిరి చెప్పిన వివరాల మేరకు కదిరికి చెందిన కృష్ణమాచార్యుల మంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. కదిరిలో వివిధ రకాలైన సామాన్లు ఐరన్ రాడ్లు, కొడవళ్లు, గొడ్డళ్లు వ్యవసాయ పరికరాలు కూడా కృష్ణమాచార్యులు విక్రయించే దుకాణాలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఆయుధాలను ఈ దుకాణం నుంచే కొనుగోలు చేసి ఉంటారని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కృష్ణమాచార్యులు సాక్ష్యంగా 164 కింద నమోదు చేసినట్లు తెలుస్తోంది.