కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ మూడోరోజు విచారణ చేపట్టింది. రెండురోజుల పాటు పోలీసులతో సమావేశమై హత్య కేసు పూర్వపరాలను తెలుసుకున్న సీబీఐ అధికారులు... ఇవాళ వివేకా కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు. ఏడుగురు సీబీఐ అధికారులు ఇవాళ పులివెందులకు వెళ్లి... డీఎస్పీ కార్యాలయంలో వివేకా హత్య కేసు వివరాలను ఆరా తీశారు. ఇదే సమయంలో ఏడుగురిలోని ముగ్గురు సభ్యుల బృందం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దాదాపు 6.30 గంటల వరకు వివేకా నివాసంలో విచారణ చేపట్టింది. వివేకా ఇంటికి తొలిసారిగా వెళ్లిన సీబీఐ అధికారులు... హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి... తన ఇంట్లో దారుణహత్యకు గురయ్యారు. హత్యా స్థలమైన బెడ్ రూం, బాత్ రూంను సీబీఐ పరిశీలించింది. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా ఇంటిని పరిశీలించే సమయంలో ఇంట్లో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడిన సీబీఐ అధికారులు హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది... హత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా... ఎవరిపైన అనుమానాలు ఉన్నాయనే కోణంలో సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కాగా హత్య కేసును గతంలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులపై నమ్మకం లేదని.. సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. 15 మంది అనుమానితుల పేర్లు ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు.