YS Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సునీల్, ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేశాడని సీబీఐ పేర్కొంది. హత్య రోజు రాత్రి సునీల్.. అవినాష్, భాస్కర్‌రెడ్డి ఇంటికెళ్లినట్లు తెలిపింది. అవినాష్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరం ఉందని.. ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. వివేకా రాజకీయాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని.. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని సీబీఐ వెల్లడించింది. ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారని.. అవినాష్‌రెడ్డి 90002 66234కు ఫోన్ చేసి కాసేపు మాట్లాడారని తెలిపింది.
వివేకా గుండెపోటుతో చనిపోయారని సీఐకి సమాచారం ఇచ్చారని పేర్కొంది. హత్యను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోందని తెలిపింది. కుట్రలో భాగంగానే గుండెపోటు, విరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోంది సీబీఐ పిటిషన్లో వెల్లడించింది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని.. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టినట్లు సీబీఐ పిటిషన్లో పేర్కొంది.