సాధించాలన్న తపన, దానికి తగిన కృషి, ప్రణాళిక ఉంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి సాధించవచ్చు. దీన్ని నిజం చేసి చూపిస్తున్నారు నందన్‌రెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కాల్వపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వీరారెడ్డి, రాజమ్మ దంపతుల చిన్నబ్బాయి ఈయన. అన్నయ్య రమేష్ రెడ్డి అదామా కంపెనీ ఉన్నతోద్యోగి. నందన్ ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలోనే సాగింది. పది, ఇంటర్మీడియట్ నెల్లూరులో చదివారు. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. బీటెక్ పూర్తయ్యాక రెండేళ్ల పాటు పుణేలోని టాటా జాన్సన్ కంట్రోల్స్ కంపెనీలో పనిచేశారు. తర్వాత 2015 వరకు ఆస్ట్రియాలోని మాగ్నాస్టైర్ కంపెనీలో విధులు నిర్వర్తించారు. విడిభాగాలతో పాటు ఏడాదికి 3 లక్షల కార్లు తయారుచేసే సామర్థ్యమున్న సంస్థ ఇది. అందులో పనిచేస్తూనే, కంపెనీ ఆర్థిక సహకారంతో ఆస్ట్రియాలో ఎంఎస్ చేశారు నందన్. విధుల్లో భాగంగా జపాన్, చైనా, పలు ఐరోపా దేశాల్లో పర్యటించారు.
సొంత కంపెనీ
ఆస్ట్రియాలో ఉద్యోగానుభవంతో తానూ సొంతగా పరిశ్రమ స్థాపించాలని నందన్‌రెడ్డి అనుకున్నారు. తన ఆలోచనల్ని బీటెక్ క్లాస్‌మేట్ సునీల్ ఎల్లాప్రగడతో పంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సునీల్ మెకట్రానిక్స్, డిస్‌ప్లే టెక్నాలజీల్లో ఎంఎస్ పట్టభద్రులు.ఆయన భాగస్వామ్యంతో కడప జిల్లా చింత కొమ్మదిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడలో 2016 ఆగస్టులో ట్రయోవిజన్-కాంపోజిట్ టెక్నాలజీ పరిశ్రమను ప్రారంభించారు నందన్. రూ.9 కోట్ల పెట్టుబడితో ఇది మొదలైంది. ట్రాఫిక్‌బూత్‌లు, విండ్‌మిల్ యంత్రాల రెక్కలు, జారుడు బల్లలు, ఎలక్ట్రికల్ వాహనాలు, మెట్రో రైలు విడిభాగాలు లాంటి ఎన్నింటినో ట్రయోవిజన్ రూపొందిస్తోంది. సునీల్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు.
మా మొదటి ఏడాది టర్నోవర్ రూ.5 లక్షలే. నాలుగేళ్లలోనే దాదాపు రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ప్రస్తుతం సంస్థలో 175 మంది పనిచేస్తున్నారు. 40 మంది ఇంజినీరింగ్ నిపుణులు కాగా, 135 మంది కార్మికులు. వీరందరికీ నెలకు రూ.25 లక్షల వరకూ వేతనాలు చెల్లిస్తున్నాం. వ్యవసాయం, మౌలిక వసతులు, రక్షణరంగం, ఫర్నీచర్ విభాగాల్లో విడిభాగాలు తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం -నందన్ రెడ్డి