కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళలు సంప్రదాయ నృత్యరీతుల వైపు అడుగులు వేస్తూ.. అందులో భాగంగా కోలాటం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో శ్రావణ్ అనే యువకుడు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నారు. కొందరు మహిళలు తమకు కోలాటం నేర్పించాలని కోరారు. పదుల సంఖ్యలో మహిళలు హాజరై కోలాటంలో శిక్షణ పొందుతున్నారు. వారంలో నాలుగు రోజులపాటు శిక్షకుడు వారికి మెళకువలు నేర్పుతుండగా... రెండు రోజులు మహిళలే సొంతగా సాధన చేస్తున్నారు. తిరుమల లాంటి పెద్ద దేవస్థానాల్లో కోలాట నృత్యాన్ని ప్రదర్శించాలనే లక్ష్యంతో శిక్షణా కేంద్రాలకు వెళ్లి తర్ఫీదు పొందుతున్నామని ఆశాభావం వ్యక్తంచేశారు.
మేము ఇంటికే పరిమితం కాదు.. ఇవి కూడా చేస్తాం
మహిళలు ఇంటి బాగోగులు చూసుకుంటూనే తమ అభిరుచులకు తగ్గట్టుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. దైనందిన జీవనంలో రాణిస్తూ సంప్రదాయ నృత్యాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు... కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన మహిళలు ఇంటికే పరిమితం కాకుండా కోలాటం నేర్చుకునేందుకు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
cadapa-kolatam
కుటుంబ సభ్యులు సహకరించడంతో నేర్చుకోవాలనే తపన పెరుగుతోందని... సుమారు ఏడు నెలల నుంచి తర్ఫీదు పొందుతుండగా ఇప్పటి వరకూ 18 పాటలకు పైగా కోలాట నృత్యం నేర్చుకున్నారు. పిల్లలను బడులకు సిద్ధం చేసి, వంట పనులు, ఇంటి పనులు సైతం త్వరగా ముగించుకుని కోలాటం నేర్చుకునేందుకు వస్తున్నారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా సంప్రదాయ నృత్యాల్లో తర్ఫీదు తీసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.