రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి, చర్చి ఫాదర్లకు, మసీదుల నిర్మాణానికి, మసీదులో పనిచేస్తున్న జీతాలు చెల్లిస్తోందని.. కానీ హిందూ దేవాలయాల అర్చకులకు ఎందుకు జీతాలు చెల్లించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. గతంలోని చర్చీలు, మసీదుల నిర్మాణాలు వారి సొంత డబ్బుతోనే జరిగేవని.. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీశైలానికి రూ. 49 కోట్లు, అన్నవరానికి రూ. 40 కోట్లు, విశాఖపట్నంలోని ఓ ఆలయానికి రూ. 49 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, వాటిలో పనిచేసే అర్చకులకు రూ. 5 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల పట్ల నిర్లక్ష్యం.. నిధుల వినియోగంలో అలసత్వం
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులకు సూక్ష్మ బిందు సేద్య పరికరాలను అందించడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం దారుణమని సోము వీర్రాజు ఖండించారు. తక్షణం రైతులకు సూక్ష్మ బిందు పరికరాలను మంజూరు చేయాలని.. లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతులకు తక్షణం సూక్ష్మ, బిందు సేద్య పరికరాలు తక్షణం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరిచిన శిక్ష బిందు సేద్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలను మూసివేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పంపిన నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. రైతులను మోసం చేసిన ఏపీ ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఆయన చెప్పారు.