రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజుల కాలం నాటి పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో భాజపా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఆయనకు భాజపా ఉపాధ్యక్ష పదవి వచ్చినందుకు గానూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
కొవిడ్ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లు నిధులు ఇస్తే ప్రధాని మోదీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని వాపోయారు. వివేకా హత్య కేసు విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేశారు. హత్య కేసులో నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో 11 రోజులుగా నిర్వాసితులు దీక్ష కొనసాగిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని... నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.