Bikes Fired: వై.ఎస్.ఆర్.జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో వరసగా మూడు రోజుల పాటు ఐదు వాహనాలు దహనం అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఇళ్ల ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేసి... వాటికి నిప్పుపెట్టిన సంఘటనలు జరిగాయి. తెల్లవారుజామున యజమానులు బయటికి వచ్చి చూసుకుంటే... వాహనాలు తగలబడి పోయిన ఘటనలు కనిపించాయి. మూడు రోజుల నుంచి ప్రతిరోజూ ఏదో ఒక వీధిలోవాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. నాలుగు రోజుల కిందట వేంపల్లె రామాలయం వీధిలో ఓ స్కూటీని తగలబెట్టారు. ఆ ఇంటికి ఎదురుగానే మరో స్కూటీకి నిప్పు పెట్టారు.
మూడు రోజుల కిందట మేదరవీధిలో రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కడప నుంచి బంధువుల ఇంటికి వేంపల్లెకు వచ్చిన ఓ మహిళ స్కూటీని బయట పెట్టగా తగలబెట్టారు. బుధవారం కూడా ఎస్బీఐ కాలనీలో కారును రాళ్లతో ధ్వంసం చేసి... నిప్పు పెట్టారు. పట్టణంలో జరిగిన వరస ఘటనలు అన్నీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల మధ్యలో జరుగుతున్న సంఘటనలేనని బాధితులు వాపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆకతాయిలు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఇలాంటి ఘటనలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.