కడప జిల్లా సంబేపల్లి మండలం ప్రకాష్ నగర్ కాలనీలో ఓ వ్యక్తికి శుక్రవారం కరోనా పాజిటివ్ వచ్చింది. కూరగాయల లోడుతో కోయంబేడుకు వెళ్లి వచ్చిన ఆ 32 ఏళ్ల వ్యక్తిని.. 2 రోజుల కిందట కరోనా పరీక్షల నిమిత్తం కడప ఫాతిమా మెడికల్ కళాశాలకు అధికారులు తరలించారు. పరీక్షల్లో కరోనా సోకినట్టుగా ఫలితం వచ్చింది.
రాయచోటి నియోజకవర్గంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నియోజకవర్గంలో లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తున్నా... కరోనా పాజిటివ్ కేసు రావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామం రాయచోటి పట్టడానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండటం, గ్రామానికి చెందిన కొందరు పురపాలికలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కారణంగా.. పట్టణంలోనూ వారి కదలికలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
శుక్రవారం వైద్య పరీక్ష ఫలితాలు వెలువడగానే కడప ఆర్డీవో మాలోల ఆధ్వర్యంలో అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది గ్రామాన్ని చుట్టుముట్టారు. గ్రామ సరిహద్దులు మూసివేశారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబీకులు, మరికొంతమంది గ్రామస్థులను క్వారంటైన్ కు తరలించారు.