కడప జిల్లాలోనూ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లిన బస్సులు.... తిరిగి బయటకు రాకుండా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. మొత్తం మీద 900 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. కడపలోని కోటిరెడ్డి , ఏడురోడ్ల, అంబేడ్కర్, అప్సర కూడళ్ల వద్ద వాహనాలను అడ్డుకుంటున్నారు. కడప నుంచి తిరుపతి మార్గంలో ఆందోళనలు చేశారు. భారత్ బంద్ కారణంగా.... యోగివేమన విశ్వవిద్యాలయంలో ఇవాళ జరగాల్సిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షను 22వ తేదీకి వాయిదా వేశారు. జిల్లావ్యాప్తంగా దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.రైతులు, కర్షకుల కడుపు కొట్టే మూడు నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని జిల్లాలోని అఖిలపక్ష పార్టీ నాయకులు అన్నారు. మోదీ ప్రవేశపెట్టిన చట్టాల వల్ల రైతు.. కూలీగా మారే అవకాశముందన్నారు. కార్పొరేట్ సంస్థలకు భాజపా ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే రైతులందరూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మైదుకూరులో వామపక్షాల నాయకులతోపాటు ప్రజా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. అంకాలమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన పట్టణ పురవీధుల్లో సాగింది. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. వెంటనే నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జమ్మలమడుగులో వామపక్షాలు ఆందోళనకు దిగారు. స్థానిక గాంధీ కూడలిలో రాకపోకలను సీపీఐ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. కమలాపురం బైపాస్‌రోడ్ లోని సర్కిల్ వద్ద సీపీఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతుల పాలిట శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.