కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ను కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ ఈఎంసీగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 380.5 కోట్ల రూపాయలను బుధవారం మంజూరు చేసింది.
ఈ క్లస్టర్ ఏర్పాటు కోసం కేంద్ర ఐటీ శాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే కొప్పర్తిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌కు పెట్టుబడులు ఆహ్వానించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
గ్రీన్ కేటగిరీలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు తనిఖీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరెంజ్, రెడ్ కేటగిరీకి ఇది వర్తించదని పరిశ్రమల శాఖ వెల్లడించింది. భూమి లీజును 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించుకునే అవకాశం కల్పించటంతో పాటు అవసరమైతే భూమిని కొనుగోలు చేసేందుకూ వీలుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు వంద శాతం స్టాంపు డ్యూటీ రీయింబర్స్మెంట్ కల్పించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది. 20 శాతం మేర పెట్టుబడి రాయితీ కూడా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఉంటుందని స్పష్టం చేసింది. 250 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే మొబైల్ ఉత్పత్తి పరిశ్రమలకు మెగా స్టేటస్ ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.