గాలేరు-నగరి రెండో దశ ప్యాకేజీ పనులపై.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సదస్సు నిర్వహించారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో.. ప్రముఖ సాగునీటి నిపుణులు తుంగా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, స్థానిక తెదేపా, సీపీఐ, సీపీఎం నేతలు, రైతు సంఘం నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కోడూరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు అందిచడమే తమ లక్ష్యమని నేతలు తెలిపారు. దానిని సాధించడం కోసం దశల వారీ పోరాటానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
రైతుల దైన్యం...
అరటి, మామిడి, బొప్పాయి పండ్ల తోటలకు, మంగంపేట బెరైటీస్, ఎర్ర చందనానికి ప్రసిద్ధిగాంచిన కోడూరులో.. తగినంత వర్షపాతం లేక రైతులు అల్లాడిపోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై పెట్టుబడుల భారం పెరిగి.. అప్పులు తీర్చలేక, అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కోడూరు, రాజంపేటల్లో చెప్పుకోదగ్గ నీటిపారుదల ప్రాజెక్టులు ఒక్కటీ లేకపోవడం వల్ల.. రైతులు పూర్తిగా వర్షంపైనే ఆధారపడుతున్నారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ఉన్నా.. ఆయకట్టుకు నీళ్లు అందే పరిస్థితి లేదని వివరించారు.