FOUNDATION STONE FOR KADAPA STEEL PLANT : వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద జిందాల్ సౌత్ వెస్ట్(జేఎస్‌డబ్ల్యూ) స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సున్నపురాళ్లపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే విధానాన్ని త్రీడీ రూపంలో తయారు చేసిన నమూనాను పరిశీలించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం ఏ విధంగా సాగుతోంది అనే దానిపై సజ్జన జిందాల్.. సీఎం జగన్‌కు వివరించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున తక్కువ మంది మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావలసిన పరిస్థితి వచ్చిందని.. లేదంటే పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసే వారమని సీఎం తెలిపారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ కంపెనీ అయిన జిందాల్ చేతికి ఉక్కు పరిశ్రమ నిర్మించే బాధ్యత అప్పగించడం చాలా సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు.
"రెండు విడతలుగా స్టీల్‌ప్లాంట్ నిర్మాణం సాగుతోంది. మంచి వ్యక్తి చేతుల్లోకి స్టీల్‌ప్లాంట్ నిర్మాణం వెళ్తోంది. సజ్జన్ జిందాల్ ముందుకు రావడం అభినందనీయం. ఈ నిర్మాణం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదు. 13 మిలియన్ టన్నుల సామర్థ్యానికి ప్లాంట్ చేరుకుంటుంది. రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి. స్టీల్‌ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి"-సీఎం జగన్
గతంలో తన తండ్రి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఆ మహా నేత మరణం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా పరిశ్రమ వైపు అడుగులు వేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సంస్థ 24 నుంచి 30 నెలల్లో మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని.. మరో 5 ఏళ్లలో రెండో దశ నిర్మాణం పూర్తి చేసుకుని మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తుందనీ సీఎం తెలిపారు.