గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార సమస్యలు రాకుండా చూడాలన్నదే అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు లక్ష్యం. కడప జిల్లాలో ఇందుకు వాస్తవ విరుద్ధమైన పరిస్థితి ఉంది. జిల్లాలోని ప్రొద్దుటూరు పరిధిలోనే 524 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 36 వేల మంది.. గర్భిణులు, బాలింతలు కలిపి మరో 7 వేల మంది వీటితో లబ్ధి పొందాల్సి ఉంది. వీరి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు రోజుకో కోడిగుడ్డు.. 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు వారానికి 4 గుడ్ల చొప్పున ఇవ్వాలి. ఈ కేంద్రాలకు రాని మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 8 గుడ్లను ఇంటికి పంచించాలి. కానీ... 3 నెలల నుంచి ఆ పరిస్థితే లేదు. అన్నం, ఆకుకూరలతోనే ఆహారం పెడుతున్న కారణంగా.. లబ్ధిదారులు అటువైపే వెళ్లడం లేదు.
డిసెంబరులో 2 సార్లు, జనవరిలో ఒక్కసారే గుత్తేదార్లు గుడ్లు సరఫరా చేశారు. ఉన్నతాధికారులు సరిగా స్పందించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ప్రొద్దుటూరు పరిధిలోనే కాదు. కడప జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే సమస్య లబ్ధిదారులను వేధిస్తోంది.