రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయడంతోపాటు తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ.. ఈనెల 28న కడప కోటి రెడ్డి సర్కిల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టనున్న ఆందోళనకు జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు తరలిరావాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై కడపజిల్లాలోని రైతు సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప ప్రెస్ క్లబ్లో తెదేపా మినహా అన్ని రాజకీయ పార్టీల రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం... శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంచాలని తీసుకువచ్చిన జీవో నెంబర్ 203 యథావిథిగా అమలు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కృష్ణా నది యాజమాన్య బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ అవసరాల పేరుతో శ్రీశైలం నీటిని తోడేస్తోందని విమర్శించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా రైతులు ఉద్యమాలకు సిద్ధం కావాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు.