తనను సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉందని అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 1980లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటినుంచి నేటి వరకు వారి కుటుంబానికి అభిమానిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్కు నమ్మినబంటుగా ఉన్నానని.. తనపై నమ్మకంతో సలహాదారుగా నియమించినట్లు చెప్పారు. రైతుల సమస్యలను గుర్తించి ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
విధేయతను వరించిన రాష్ట్రస్థాయి పదవి
వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ విధేయతను పాటించే అంబటి కృష్ణారెడ్డిని కీలక పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో జమ్మలమడుగులో ఏర్పాట్లు, బహిరంగ సభలో వ్యవసాయ అధికారుల పనితీరును ప్రశ్నించడంతో జగన్ దృష్టిలో పడినట్లు వైకాపా కార్యకర్తలు చెబుతారు.
వైఎస్సార్ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు సీఎం జగన్ ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. ఎర్రగుంట్ల మండలానికి చెందిన అంబటి కృష్ణారెడ్డికి కీలకమైన పదవిని ఇవ్వడం అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో చేరమని అప్పటి నాయకులు ఆయనపైఎంతో ఒత్తిడి చేసినా... పార్టీ మారకుండా వైకాపాకు అండగా నిలిచారని గుర్తు చేశారు.
ఇదీ చదవండీ... మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి