కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లెలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మైదుకూరు గ్రామీణ సీఐ వేధిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
వీడియో వైరల్: సీఐ వేధిస్తున్నాడని ఆ కుటుంబం ఏం చేసిందంటే..!
11:36 September 11
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అక్బర్ బాషా ఆరోపణలు
దువ్వూరు మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తమ కుటుంబానికి చెందిన 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు మైదుకూరు రూరల్ సీఐకి తమ సమస్యను వివరించారు. తన సమస్యను పరిష్కరించకుండా వైకాపా నేతకు అనుకూలంగా సీఐ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపొందించారు. సీఐ కొండారెడ్డి, వైకాపా నాయకుడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటిపర్యంతమయ్యారు. తన సమస్యపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నాకు 2009లో దానవిక్రయం కింద ఎకరన్నర భూమి రిజిస్టర్ అయింది. ఈ భూమిపై వివాదం తలెత్తడంతో న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. నా సమస్యపై స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఆయన మైదుకూరు సీఐను కలవాలని సూచించారు. ఎస్పీ సూచనతో మైదుకూరు సీఐని కలిసి నా సమస్యను వివరించాను. ఆయన నా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ స్థానిక వైకాపా నేతతో కలిసి నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఎన్కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నారు. అయినా సీఐ ఎన్కౌంటర్ చేసేంత వరకు మేము బతకం. ఆత్మహత్య చేసుకుంటాం. సీఎం సార్... ఇదీ మీ పాలనలో జరుగుతున్న వ్యవహారం. మా సమస్యను గుర్తించి న్యాయం చేయండి.
-అక్బర్ బాషా, బాధితుడు
ఇదీచదవండి.