ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణనీయం.... జీహెచ్​ఎంసీ అభ్యర్థుల నేరచరితం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారు గణనీయంగానే ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సమర్పించిన  అఫిడవిట్లను ‘ఈనాడు-ఈటీవీ భారత్’ విశ్లేషించింది.

crime history in ghmc candidates
గణనీయం అభ్యర్థుల నేరచరిత్రం

By

Published : Nov 26, 2020, 6:03 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మంది అభ్యర్థులు నేరచరిత్ర కలిగిన వారు ఉన్నారు. మొత్తం 150 వార్డుల నుంచి 1122 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 41 డివిజన్లలో నేరచరితులున్నట్లు స్పష్టమవుతోంది. వీరిలో ఆరుగురు మహిళలు. ఈ వివరాలతో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) సంస్థ సైతం బుధవారం నివేదిక విడుదల చేసింది. మల్కాజిగిరి (140) వార్డులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నేరచరిత్ర కలిగిన వారే కావడం గమనార్హం. కిందటిసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరితులు బరిలో నిలవగా.. ఈసారి ఆ సంఖ్య 49కి తగ్గడం కొంత నయం.

పార్టీల వారీగా ఎవరెవరు?

భాజపా

కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ భాజపా అభ్యర్థి ప్రీతమ్‌రెడ్డిపై అత్యధికంగా 9 కేసులున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి 5, రాంనగర్‌ అభ్యర్థి రవికుమార్‌ 4, బేగంబజార్‌ అభ్యర్థి శంకర్‌యాదవ్‌ 3, అంబర్‌పేట అభ్యర్థి యశ్వంత్‌ 2, గుడిమల్కాపూర్‌ అభ్యర్థి కరుణాకర్‌ 2 కేసులలో నిందితులు. నర్సింహారెడ్డి (మన్సూరాబాద్‌), మధుసూదన్‌రెడ్డి (చంపాపేట్‌), రాధ (ఆర్‌కేపురం), పవన్‌కుమార్‌ (కొత్తపేట), లాల్‌సింగ్‌ (గోషామహల్‌), అశోక్‌ (కార్వాన్‌), మహిపాల్‌రెడ్డి (బంజారాహిల్స్‌), గంగరాజ్‌ (యూసుఫ్‌గూడ), రఘునాథ్‌ (కొండాపూర్‌), శంకర్‌రెడ్డి (సూరారం), శ్రవణ్‌ (మల్కాజిగిరి)లపై ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి.

తెరాస

మోండా మార్కెట్‌ డివిజన్‌, రాంగోపాల్‌పేట అభ్యర్థినులు ఆకుల రూప, అరుణలపై నాలుగేసి చొప్పున, మల్కాజిగిరి అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్‌పై 3 కేసులు ఉన్నాయి. మచ్చబొల్లారం, రంగారెడ్డినగర్‌, శేరిలింగంపల్లి, శాస్త్రిపురం అభ్యర్థులు జితేందర్‌, విజయ్‌శంకర్‌, నరేంద్రయాదవ్‌, రాజేశ్‌యాదవ్‌ రెండేసి కేసుల్లో నిందితులు. విఠల్‌రెడ్డి (చైతన్యపురి), బాబాఫసీయుద్దీన్‌ (బోరబండ), ముత్తుకుమార్‌ యాదవ్‌ (పటాన్‌చెరు), శ్రీనివాసరావు (హైదర్‌నగర్‌), ప్రేమ్‌కుమార్‌ (ఈస్ట్‌ ఆనంద్‌భాగ్‌), సునీతరెడ్డి (మెట్టుగూడ)లపై ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి.

ఎంఐఎం

శాలిబండ అభ్యర్థి మహ్మద్‌ ముస్తఫా అలీ 7 కేసుల్లో నిందితుడు. అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, ఆయుధాలతో అల్లర్లకు పాల్పడటం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం.. తదితర అభియోగాలతో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. కిషన్‌భాగ్‌ అభ్యర్థి ముబాషిరుద్దీన్‌ 4, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్‌ వాహబ్‌ 2 కేసుల్లో నిందితులు. మిన్హజుద్దీన్‌ (అక్బర్‌భాగ్‌), అలీషరీఫ్‌ (లలితభాగ్‌), జకీర్‌బాకర్‌ (దత్తాత్రేయనగర్‌), స్వామి (కార్వాన్‌)లపై ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి.

కాంగ్రెస్‌

జహనుమా, శేరిలింగంపల్లి అభ్యర్థులు ఘయాసుద్దీన్‌, శివకుమార్‌లపై మూడేసి కేసులున్నాయి. బేగంబజార్‌ అభ్యర్థి పురుషోత్తం 2 కేసుల్లో నిందితుడు. నిర్మల (ఆర్‌కేపురం), మూసాఖాసిం (పత్తర్‌ఘట్టి), ఎం.షరీఫ్‌ (సంతోష్‌నగర్‌), ముస్తఫాఖాద్రీ (రియాసత్‌నగర్‌), రాములుగౌడ్‌ (గుడిమల్కాపూర్‌), నిజాముద్దీన్‌ (షేక్‌పేట), మహిపాల్‌యాదవ్‌ (కొండాపూర్‌), రేణుక (హఫీజ్‌పేట), శ్రీనివాస్‌గౌడ్‌ (మల్కాజిగిరి)లు ఒక్కో కేసులో నిందితులు.

నాణ్యమైన సేవలు అందించే వారినే ఎన్నుకోండి

హైదరాబాద్‌ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఆస్తి, ప్రాణనష్టం సంభవించాయి. ఈ నేపథ్యంలో నగర పౌరులకు నాణ్యమైన సేవల్ని అందించే జీహెచ్‌ఎంసీ అవసరం. అందుకు తగిన నేతల్నే ఎన్నుకోవాలి. నేరచరిత్ర లేని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే వారికే ఓటు వేయాలి. అభ్యర్థులు నచ్చకపోతే ఓటు వేయడం మానొద్దు. కనీసం నోటాకైనా వేసి నిరసన తెలపండి.

-ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

ఇదీ చదవండీ...'జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం'

ABOUT THE AUTHOR

...view details