"ప్రభుత్వ చర్యతో 31 లక్షల రైతు కుటుంబాలకు నష్టం" - congress vs ycp
వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం కుదింపు, రైతు రుణమాఫీ జీవో రద్దు చర్యలతో కర్షక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేకూరుస్తోందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.
తెదేపా హయాంలో జారీ చేసిన రుణమాఫీ జీవోను రద్దు చేసి వైకాపా సర్కార్ రైతులను మోసం చేసిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో అన్నదాతలు ఆవేదనకు గురవతున్నారని అన్నారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. రైతుల రుణమాఫీకి సంబంధించిన జీవో 38ను రద్దు చేయటంతో 31 లక్షల 45 వేల రైతు కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 12,500 ఇస్తామని చెప్పి రూ. 6500 కుదించారని అన్నారు. ఓసీలకు ఈ పథకాన్ని అమలు చేయకపోవటం దారుణమని విమర్శించారు. ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేదిగా నిర్ధారణ అయిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి పేర్కొన్నారు.