వారం రోజుల నుంచి కడప జిల్లాలో రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగానే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రులు, 20 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండిపోయాయి. ఈ సమయంలో చాలామంది పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్న వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక 104 కాల్ సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. కరోనా పరీక్షల వివరాల కోసం రోజుకు 3వందలకు పైగానే ఫిర్యాదులు వస్తున్నాయి. పడకల కోసం రోజుకు 50 నుంచి 70 మంది ఫోన్లు చేస్తున్నారు. వీరందరికీ 104 కాల్ సెంటర్ అధికారులు సమాధానాలు ఇస్తూ.. కావాల్సిన సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఏప్రిల్ మొదటి నుంచి ఇప్పటివరకు కడప కాల్‌సెంటర్‌కు 3వేల 367 ఫోన్ కాల్స్ వచ్చాయంటున్నఅధికారులు దాదాపు అన్నీ పరిష్కరించినట్లు చెబుతున్నారు. కానీ కొందరు అనవసరంగా 104 కాల్ సెంటర్ కు ఫోన్లు చేస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ కాల్స్ వల్ల తమ పని కష్టం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన వారు తిరిగి తాము కాల్ చేస్తే సరైన సమాధానం చెప్పకుండా.. దాటవేస్తున్నారని అధికారులు వాపోతున్నారు.