ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త హత్యకు ప్రణాళిక.. కోడిపుంజుపై సైనేడ్​ ప్రయోగం - పశ్చిమ గోదావరి జిల్లా నేర వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భర్తను అంతమొందించాలని అనుకుంది భార్య. కుమారుడితో పాటు మరో ముగ్గురి సాయాన్ని తీసుకుని పథకం రచించింది. ఆహారంలో సైనేడ్​ పెట్టి చంపాలని నిర్ణయించారు. ముందుగా ఆ సైనేడ్​ను కోడిపుంజుపై ప్రయోగించారు. అనంతరం సైనేడ్​ను మటన్​ కర్రీలో కలిపి భర్తకు తినిపించాలని చూశారు. రుచి వేరుగా ఉండడం వల్ల కూర వదిలేసిన భర్త వారి కుట్ర నుంచి తప్పించుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్​ సినిమాకు ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరిగింది.

భర్తకు పెట్టాల్సిన సైనేడ్ పని చేస్తుందో లేదో అని..!
భర్తకు పెట్టాల్సిన సైనేడ్ పని చేస్తుందో లేదో అని..!

By

Published : Feb 20, 2020, 3:09 PM IST

Updated : Feb 20, 2020, 7:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్ గురునాథ్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. వీరికి వివాహం జరిగి సుమారు 19 సంవత్సరాలు అయింది. అయితే భర్త గురునాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య రాణి, కుమారుడు అతనితో కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య, కుమారుడు కలిసి గురునాథ్​ను చంపాలని భావించారు. దీనికి అదే గ్రామానికి చెందిన ఎ.ధనలక్ష్మి ఆమె భర్త శ్రీనివాసరావుల సాయం కోరారు. ఆహారంలో సైనేడ్​ కలిపి చంపితే ఎవరికీ అనుమానం రాదని వారు ప్రణాళిక రచించారు. ద్వారకా తిరుమల మండలం జాజులకుంటకు చెందిన వెంపా మోజేస్ సహకారంతో లిక్విడ్ సైనేడ్ తెప్పించుకున్నారు.

కోడిపుంజుపై ప్రయోగం

ముందుగా సైనేడ్​ పనిచేస్తుందో లేదో అని దానిని తమ ఇంట్లోని కోడిపుంజుపై ప్రయోగించారు. వారు పెట్టిన ఆహారం తిని కోడిపుంజు రంగు మారి చనిపోయింది. కోడిపుంజు ఎందుకు చనిపోయిందని భర్త ప్రశ్నించగా.... వైరస్ సోకిందని నమ్మించారు. అనంతరం పక్కా పథకంతో గత ఆదివారం మటన్ కూరలో సైనేడ్ కలిపి గురునాథ్​కు పెట్టారు. మొదటి ముద్ద తిన్న గురునాథ్.... రుచి వేరుగా, పుల్లగా ఉండటంతో అనుమానం వచ్చి కూరను వదిలేశాడు.

భర్త నిద్రపోతున్నాడనుకుని..

సోమవారం ఉదయం గురునాథ్​ నిద్రపోతున్నాడనుకుని ఇంట్లోనే భార్య రాణి, ధనలక్ష్మి, శ్రీనివాస్ సైనేడ్ పథకాన్ని చర్చించుకున్నారు. భార్య పన్నాగాన్ని తెలుసుకున్న గురునాథ్ ఆ రోజు సాయంత్రం భీమడోలు పోలీస్ స్టేషన్​కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతని ఇంటిలోని మటన్ కర్రీ, సైనేడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురుని అరెస్టు చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని గురునాథ్ కోరుతున్నాడు.

ఇదీ చదవండి:

నిర్భయ: ఉరి పడుతుందని.. తల పగలగొట్టుకున్నాడు!

Last Updated : Feb 20, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details