నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్న తీరు సరికాదని.. అసలు ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు రఘురామకృష్ణరాజుపై అంత ప్రత్యేక శ్రద్ధ అని మంత్రి నిలదీశారు. 14 నెలలు నుంచి ఎంపీ దిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలి కొదిలేశారనా? అని ప్రశ్నించారు. కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.
పశ్చిమగోదావరి అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా అని.. అంతా సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై తాను సైతం కేసు పెట్టానని మంత్రి చెరుకువాడ స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు, ఆచారాలు రఘురామకృష్ణరాజుకు అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆ ఎంపీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందని.. కానీ ఇంతకాలం ఉపేక్షించిందని.. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. కొన్ని వర్గాలపై రఘురామకృష్ణరాజు విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసి, ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.