కరోనా కట్టడే లక్ష్యంగా జిల్లా అధికారులు సమష్టిగా కృషి చేస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. కరోనా నిర్ధరణకు అనుసరిస్తున్న పూలింగ్ విధానం, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షల నిర్వహణ, రక్షణ పరికరాల సరఫరా తదితర అంశాల గురించి ఆమె వివరించారు. "ప్రస్తుతం కరోనా నిర్ధరణకు పూలింగ్ విధానంలో పరీక్షలు చేస్తున్నాం. అంటే ఒకేసారి కరోనా లక్షణాలున్న ఐదుగురి నుంచి నమూనాలు తీసుకుని ఉమ్మడిగా పరీక్షిస్తాం. అందులో పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే ఒక్కొక్కరి నుంచి వేర్వేరుగా నమూనాలు సేకరించి విజయవాడ లేదా కాకినాడ పంపుతాం. ఆ ఫలితాలనే తుది ఫలితాలుగా పరిగణిస్తాం. లక్షణాలు కనిపించకుంటే ఒకేసారి ఐదుగురి ఫలితాలను నెగిటివ్‌గా నిర్ధ.రిస్తాం. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు చేసేందుకు అవకాశం ఉంటుంది. త్వరగా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు వీలవుతుంది" అని సుబ్రహ్మణ్యేశ్వరి చెప్పారు.
ఆలస్యానికి కారణమిదే..
జిల్లాలో ఫలితాలు రావాల్సిన నమూనాలు మూడు వేల వరకు ఉన్నాయని తెలిపారు. వీటి ఫలితాలు ఆలస్యం కావడంతో వదంతులను ప్రచారం చేస్తున్నారన్నారు. కొందరి ఫలితాలు వచ్చినా అధికారులు చెప్పడం లేదంటున్నారు. జిల్లా నమూనాలను కొన్ని విజయవాడకు, మరికొన్ని కాకినాడకు పంపిస్తున్నామని... అక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. "రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకే ఆ జిల్లాల నుంచి వస్తున్న నమూనాలను పరీక్షించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పశ్చిమలో కేసుల ఉద్ధృతి తక్కువగా ఉన్నందున ఫలితాలు కొంచెం ఆలస్యమవుతున్నాయి. తీవ్ర జాప్యం కావడంలేదు. శుక్ర, శనివారాల్లో 300 నమూనాలకు నెగిటివ్ ఫలితాలొచ్చాయి. జిల్లాలో వైద్యులు, వైద్య సిబ్బంది వినియోగించే అన్ని రకాల రక్షణ పరికరాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 13, 223 పీపీఈ కిట్లు, 12,911 ఎన్ 95 మాస్క్‌లు, 10,92,183 ట్రిపుల్ లేయర్ మాస్క్‌లు, 3,47,058 చేతి తొడుగులు ఉన్నాయి. వీటిని జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి అందుబాటులో ఉంచుతున్నాం" అని సుబ్రహ్మణ్యేశ్వరి వివరించారు.